భారత్‌లో యాప్‌పై ఆంక్షలు.. స్పందించిన టెలిగ్రామ్ సీఈఓ

  • నీట్ రీ-ఎగ్జామ్ నేపథ్యంలో టెలిగ్రామ్‌పై తాత్కాలిక నిషేధం
  • చీటింగ్, తప్పుడు ప్రచారాలను అరికట్టేందుకే ఈ నిర్ణయం
  • జూన్ 21న దేశవ్యాప్తంగా నీట్-యూజీ పునఃపరీక్ష
  • కేంద్రం చర్యను తప్పుబట్టిన టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్
  • ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్ యాప్‌ను తొలగించిన గూగుల్
నీట్-యూజీ 2026 పునఃపరీక్షను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై దేశవ్యాప్తంగా జూన్ 22 వరకు తాత్కాలిక ఆంక్షలు విధించింది. పరీక్ష సమయంలో చోటుచేసుకునే అక్రమాలను, తప్పుడు ప్రచారాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సిఫార్సు మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.

కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ స్పందించారు. కొందరు చేసే తప్పులకు భారత్‌లోని 150 మిలియన్ల మంది సాధారణ వినియోగదారులను శిక్షించడం సమంజసం కాదని ఆయన 'ఎక్స్' వేదికగా విమర్శించారు. ఈ నిషేధం వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదని, లీకేజీలకు పాల్పడేవారు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

కాగా, ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా గూగుల్ ఇప్పటికే తన ప్లే స్టోర్ నుంచి టెలిగ్రామ్‌ను తొలగించగా, యాపిల్ కూడా త్వరలోనే ఈ దిశగా చర్యలు తీసుకోనుంది.

నీట్ పునఃపరీక్ష నేపథ్యంలో కొందరు కేటుగాళ్లు టెలిగ్రామ్ ఛానెళ్ల వేదికగా నకిలీ ప్రశ్నపత్రాలు విక్రయిస్తామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పాత మెసేజ్‌లను ఎడిట్ చేస్తూ ప్రశ్నాపత్రాలు లీకైనట్లు నకిలీ ఆధారాలను సృష్టిస్తూ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మానసిక ఆందోళనకు గురిచేస్తున్నారు. ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకే ప్రభుత్వం ఈ యాప్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించింది. అంతేకాకుండా, జూన్ 30 వరకు టెలిగ్రామ్‌లో మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను కూడా నిలిపివేశారు.

Telegram
Pavel Durov
NEET UG 2026
India app ban
National Testing Agency
IT Act Section 69A

More Telugu News